అనగనగా ఎపిసోడ్ 6 : వేట

S V Ranga Rao Kathalu

Get the SBS Audio app

Other ways to listen

బండారు అచ్చమాంబ,చింతా దీక్షితులు, భమిడిపాటి, మల్లాది, మా గోఖలే, మునిమాణిక్యం వంటి లబ్దప్రతిష్టులైన తొలితరం కథకుల తర్వాతి తరంలో కొందరు కథలు రాశిలో తక్కువ కథలు రాసినా వాసిపరంగా గొప్ప కథలు రాసారు.


అటువంటి వారిలో ప్రముఖ నటులు కీర్తిశేషులు యస్. వి. రంగారావు గారు ఒకరు కావడం మనకి ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కారణం వారు మంచి కథా రచయిత అనే విషయం చాలా మందికి తెలియకపోవడం.

ఎస్. వి. రంగారావు గారు 1945 నుండి 1960 మధ్య కాలంలో యువ, ఆంధ్ర పత్రిక వంటి పత్రికలలో దాదాపు 10 వరకూ కథలు రాసారు. ఆనాటి ఆచార వ్యవహారాలు,జమిందారీ పద్ధతులు, కట్టుబాట్లు వంటి అంశాలు ఆయన కథల్లో కనిపిస్తాయి. ప్రతి కథలోనూ ఒక సమస్యని ప్రస్తావించి సంస్కరణ అనే ఆయుధంతో ఆ సమస్యని ఎలా పరిష్కరించాలో ఆయన తనదైన శైలిలో చెప్పారు. రంగారావు గారి కథల్లో వచనం చాలా వైవిధ్యభరితంగా ఉంటుంది. ఆయన రాసిన కథల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన కథ వేట. మిగిలిన కథలు ఆయన ఊహాజనితం కాగా, ఈ కథ ఆయన స్వానుభవం నుండి పుట్టింది.ఆ రోజుల్లో ఖాళీ సమయాల్లో తన సహనటుల తో వేట కి వెళ్లడం రంగారావు గారికి ఒక వినోదంలా ఉండేది. అలా ఒకసారి వేటకి వెళ్లి చిరుత ని చంపిన రంగారావు మొదట ఘనత ని సాధించిన వాడిలా స్నేహితుల ముందు డాంబికం ప్రదర్శిస్తాడు. కానీ కాసేపటికే ఆ ఆనందం ఆవిరై తనలోని మానవత్వం తనని దహించి వేస్తుంది.కృరజంతువుల నివాసమైన అడవిలోకి పనిగట్టుకుని మరీ వెళ్లి వాటిని చంపి మానసిక ఆనందం పొందిన తన దారుణ మానసిక ప్రవృత్తి పట్ల తీవ్రంగా చింతిస్తూ అంతఃసంఘర్షణ కి లోనవుతాడు. ఆ క్షణంలో రంగారావు మనసు నుండి అక్షర రూపంలో వెలుగు చూసిన ఆణిముత్యమే ఈ వేట కథ. ఆద్యంతమూ ఉత్కంఠ భరితంగా, ఆలోచనాత్మకం గా సాగే ఈ వేట కథ ఈ వారం అనగనగా కార్యక్రమం లో మీ కోసం.



తెలుగు భాషాభిమాని, సిడ్నీ నగర వాసి శ్రీనివాస్ కాండ్రు గారు ఈ కథని SBS తెలుగు "అనగనగా" పాడ్కాస్ట్ సిరీస్ ద్వారా మీకు అందిస్తున్నారు. ఇదే అనగనగా శీర్షిక లో చివరి భాగం.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.

Share